ఇండోనేషియాలో ప్రంబానన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వారసత్వ పరిరక్షణలో కీలక పాత్ర | PM Modi Visits Indonesia’s Prambanan Temple: How India Revived Shared Civilisational Heritage Across the World


ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రపంచ ప్రసిద్ధ ప్రంబానన్ హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విదేశాల్లోని భారతీయ నాగరికత, సనాతన సంస్కృతికి చెందిన చారిత్రక దేవాలయాలు, వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణలో భారత్ చేపట్టిన కార్యక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఈ చర్యలు సాంస్కృతిక దౌత్యానికి, చారిత్రక బంధాల బలోపేతానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

బంగ్లాదేశ్‌లో దేవాలయాల పునరుద్ధరణ

1971లో ధ్వంసమైన చారిత్రక రమ్నా కాళీ ఆలయం పునర్నిర్మాణానికి భారత్ సహకారం అందించగా, 2021లో ఆలయం తిరిగి ప్రారంభమైంది. అలాగే నటోర్‌లోని దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన జయ్ కాళీ మాత ఆలయం,ఆనందమయీ కాళీమాత ఆలయం, రామకృష్ణ ఆలయం పునరుద్ధరణకు కూడా భారత ప్రభుత్వం గ్రాంట్ సహాయం అందించింది.

వియత్నాం, మయన్మార్‌లో వారసత్వ సంరక్షణ

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న వియత్నాం మై సన్ (My Son) శైవ ఆలయ సముదాయ పునరుద్ధరణలో భారత్ భాగస్వామ్యమైంది. అలాగే మయన్మార్‌లోని యునెస్కో గుర్తింపు పొందిన బగాన్ పురావస్తు ప్రాంతంలో భూకంపంతో దెబ్బతిన్న 12 చారిత్రక పగోడాలు, చారిత్రక ఆనంద ఆలయం పునరుద్ధరణను భారత పురావస్తు శాఖ (ASI) చేపట్టింది.

నేపాల్‌లో 28 వారసత్వ కట్టడాలకు సహాయం

2015 భూకంపం అనంతరం నేపాల్ పునర్నిర్మాణానికి భారత్ ప్రకటించిన 50 మిలియన్ డాలర్ల సహాయంలో భాగంగా 28 సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపట్టింది. ఇందులో సేతో మచ్ఛింద్రనాథ్ ఆలయం, బుధనీలకంఠ ఆలయ ధర్మశాల వంటి ప్రముఖ కట్టడాలు ఉన్నాయి.

అంగ్కోర్ నుంచి వాట్ ఫూ వరకు

కంబోడియాలోని ప్రపంచ ప్రఖ్యాత అంగ్కోర్ వాట్, తా ప్రోమ్, ప్రెహ్ విహియర్ వంటి చారిత్రక కట్టడాల సంరక్షణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే లావోస్‌లోని దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన వాట్ ఫూ శివాలయం పునరుద్ధరణ కార్యక్రమాలకు కూడా భారత్ సహకారం అందిస్తోంది.

గల్ఫ్, శ్రీలంకలోనూ సహకారం

2019లో బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మనామాలోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీనాథ్‌జీ ఆలయం పునర్వికాస ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే శ్రీలంకలోని చారిత్రక తిరుకేతీశ్వరమ్ ఆలయం పునరుద్ధరణకు భారత ప్రభుత్వం గ్రాంట్ సహాయం అందించింది.

సాంస్కృతిక దౌత్యానికి ప్రాధాన్యం

ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలతో భారతదేశానికి వేల ఏళ్లుగా కొనసాగుతున్న నాగరికత, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లోని చారిత్రక హిందూ దేవాలయాలు, పురాతన వారసత్వ కట్టడాల సంరక్షణ ద్వారా భారతదేశం తన సాంస్కృతిక దౌత్యాన్ని మరింత విస్తరిస్తోందని పేర్కొంటున్నారు.



Source link

Leave a Comment