USA: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి! | Mass Shooting in USA: 9 Dead, Including Two Children and a Pregnant Woman


USA: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఈరీ (Erie) నగరంలో దారుణం జరిగింది.  ఓ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ఇంటి వద్ద దుండగుడు జరిపిన అకారణ కాల్పుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణీతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు మొదట ఇంటి బయట ఉన్న ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్న మిగతా వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘోర కాండలో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక గర్భిణీ మహిళ కూడా ఉన్నారు. మొత్తం 9 మంది ఈ ఘటనలో మృతి చెందారు. అయితే అందరిపై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు తను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల దర్యాప్తు:

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో తరచూ జరుగుతున్న ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఈ సందర్భంగా పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో శనివారం మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతును ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత, బాధితులకు, గాయాలైన వారికి సహాయం చేయడానికి స్థానిక ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.



Source link

Leave a Comment