Pakistan Semifinal Scenarios : ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ జాతకం.. కివీస్ దెబ్బ కొడితే పాక్ ప్యాకప్ చెప్పాల్సిందే – Telugu News | Pakistan’s Semifinal Fate Rests on ENG vs NZ Can Salman Aghas Men Survive the Super 8 Chaos?


Pakistan Semifinal Scenarios : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్తుల కోసం జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా గ్రూప్-2లో పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు చావు రేవో అన్నట్టుగా తయారైంది. శుక్రవారం (ఫిబ్రవరి 27) ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్ ఫలితంపై పాకిస్థాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ ఒక్క మ్యాచ్ పాకిస్థాన్‌ను సెమీస్‌కు చేరుస్తుందా లేక ఇంటికి పంపిస్తుందా అన్నది తేలిపోనుంది. ప్రస్తుతం పాక్ అభిమానులంతా తమ జట్టు కోసం కంటే, ఇంగ్లాండ్ గెలవాలని ఎక్కువగా కోరుకుంటున్నారు.

సూపర్-8లో గ్రూప్-2 సమీకరణాలను ఒకసారి పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంక జట్టు వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క సెమీస్ బెర్త్ కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. కివీస్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం, ఒక రద్దుతో 3 పాయింట్లు సాధించింది. మరోవైపు సల్మాన్ ఆగా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ రావడమే పాకిస్థాన్‌కు దక్కిన ఏకైక ఊరట.

ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్థాన్ ఆశలు గల్లంతవుతాయి. కివీస్ గెలిస్తే వారి పాయింట్లు 5కి చేరుతాయి. అప్పుడు పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా కేవలం 3 పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది. అంటే కివీస్ విజయం పాకిస్థాన్‌కు మరణశాసనమే. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతేనే పాకిస్థాన్‌కు చిన్నపాటి అవకాశం ఉంటుంది. అప్పుడు పాక్ తన చివరి మ్యాచ్‌లో లంకను భారీ తేడాతో ఓడించి, మెరుగైన రన్ రేట్‌తో సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది.

పాకిస్థాన్ జట్టు ఈ సూపర్ 8లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 2 వికెట్ల తేడాతో ఓడిపోయి చేజేతులా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు తమ ప్రతాపం చూపడం కంటే, పక్క జట్ల ఫలితాలపై ఆధారపడటం పాక్ జట్టుకు అలవాటుగా మారింది. మరి ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్థాన్‌కు ప్రాణం పోస్తుందా? లేక కివీస్ గెలిచి పాకిస్థాన్‌ను విమానం ఎక్కించి పంపేస్తుందా? అన్నది తేలిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Comment