కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ – Telugu News | RIL’s Historic FY26: Mukesh Ambani’s Co. Shatters Profit Records, Leads Indian Market


భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.19,407 కోట్లుగా ఉన్న లాభం, ఈసారి 12.6 శాతం తగ్గి రూ.16,971 కోట్లకు చేరింది. ముఖ్యంగా ఆయిల్-టు-కెమికల్స్ విభాగంలో బలహీనత, పెరుగుతున్న ఖర్చులు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. అయినప్పటికీ జియో ప్లాట్‌ఫామ్స్‌, రిలయన్స్‌ రీటేల్‌ వంటి వినియోగదారుల వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతూ కంపెనీకి బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 20,000 స్టోర్ల మైలురాయిని దాటడం గమనార్హం.

నాలుగో త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయం 12.9 శాతం పెరిగి రూ.3,25,290 కోట్లకు చేరుకోగా, మొత్తం FY26లో ఆదాయం 9.8 శాతం వృద్ధితో రూ.11,75,919 కోట్ల రికార్డు స్థాయిని అందుకుంది. EBITDA కూడా 13.4 శాతం పెరిగి రూ.2,07,911 కోట్లకు చేరింది. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే, 2026లో ఇప్పటివరకు కంపెనీ షేర్ ధర దాదాపు 15 శాతం పడిపోయినా, మార్కెట్ క్యాప్ రూ.18 లక్షల కోట్లకు పైగా ఉండి, దేశంలో అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇతర ప్రధాన కంపెనీలతో పోలిస్తే HDFC బ్యాంక్‌ రూ.76,026 కోట్ల లాభంతో రెండో స్థానంలో ఉండగా, SBI సుమారు రూ.83,746 కోట్ల లాభాన్ని నమోదు చేసే అవకాశముంది. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ రూ.49,454 కోట్ల లాభంతో వెనుకబడి ఉంది. మొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన బలమైన వ్యాపార విస్తరణతో ఇతర భారతీయ కంపెనీలను గణనీయంగా అధిగమించి, లాభాల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Comment