మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ పాలను గుర్తించండి | Is Your Milk Pure? 5 Easy Home Tests to Detect Adulterated Milk and Stay Safe


భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు పాలు రోజువారీ ఆహారంలో అంతర్భాగం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, ఎముకల బలానికి పాలు కీలక పోషకాహారంగా భావిస్తారు. అయితే, ఇటీవల భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) నిర్వహించిన సర్వే పాల నాణ్యతపై ఆందోళన కలిగించే విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాల నమూనాలను పరీక్షించగా, దాదాపు 70 శాతం నమూనాలు నాణ్యత ప్రమాణాల్లో విఫలమైనట్లు గుర్తించారు. కొన్ని నమూనాల్లో నీరు, స్టార్చ్, డిటర్జెంట్, యూరియా, సింథటిక్ పదార్థాలు వంటి కల్తీ పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది.

కల్తీ పాలను నిరంతరం తీసుకోవడం వల్ల పాలలోని పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా, జీర్ణ సమస్యలు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం, అలాగే మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే, మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా లేదా కల్తీ జరిగిందా అనే విషయాన్ని ఇంట్లోనే కొన్ని సులభ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.

1. నీరు కలిపారా? ఇలా తెలుసుకోండి

పాలలో ఎక్కువగా జరిగే కల్తీ నీరు కలపడం. దీనిని గుర్తించేందుకు గాజు లేదా టైల్స్ వంటి మృదువైన ఉపరితలంపై ఒక చుక్క పాలు వేయండి.
స్వచ్ఛమైన పాలు అయితే ఆ చుక్క ఎక్కువగా కదలకుండా అదే చోట ఉంటుంది. నీరు కలిపిన పాలు అయితే వెంటనే జారిపోతాయి. అలాగే దాని వెనుక పాల జాడ కూడా పెద్దగా కనిపించదు.

2. స్టార్చ్ కల్తీని ఎలా గుర్తించాలి?

కొంతమంది పాల పరిమాణం, చిక్కదనం పెంచేందుకు స్టార్చ్ కలుపుతారు. దీన్ని గుర్తించడానికి ఒక గ్లాసులో కొద్దిగా పాలు తీసుకుని అందులో కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేయాలి. పాలు నీలం రంగులోకి మారితే స్టార్చ్ కలిపినట్లు అర్థం. రంగు మారకపోతే పాలు స్వచ్ఛమైనవిగా భావించవచ్చు.

3. డిటర్జెంట్ కలిపారా? ఈ పరీక్ష చేయండి

పాలు మరింత తెల్లగా, చిక్కగా కనిపించేందుకు కొన్నిసార్లు డిటర్జెంట్ లేదా వాషింగ్ పౌడర్ కలుపుతారు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరం.

పరీక్ష విధానం:

  • 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలను గ్లాసులో తీసుకోండి.
  • అంతే పరిమాణంలో నీరు కలిపి బాగా షేక్ చేయండి.

ఫలితం: పైభాగంలో ఎక్కువసేపు నిలిచే మందమైన నురుగు ఏర్పడితే డిటర్జెంట్ కలిపిన అవకాశం ఉంది.
స్వచ్ఛమైన పాలలో ఏర్పడే బుడగలు కొద్దిసేపటికే మాయమవుతాయి.

4. సింథటిక్ పాలను ఎలా గుర్తించాలి?

  • రసాయనాలు, సబ్బు, సున్నం వంటి పదార్థాలతో తయారుచేసే సింథటిక్ పాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిని మూడు విధాలుగా గుర్తించవచ్చు.
  • వాసన ద్వారా: పాలను కొద్దిగా వేడి చేయండి. స్వచ్ఛమైన పాలకు సహజమైన తియ్యటి వాసన ఉంటుంది. థటిక్ పాలకు సబ్బు లేదా డిటర్జెంట్‌ను పోలిన ఘాటైన వాసన వస్తుంది.
  • రుచి ద్వారా..: సింథటిక్ పాలు తాగినప్పుడు కొద్దిగా చేదుగా లేదా సబ్బు రుచిలా అనిపిస్తుంది.

మరిగించినప్పుడు

సింథటిక్ పాలు మరిగించినప్పుడు అసాధారణంగా చిక్కగా మారడం లేదా లేత పసుపు రంగులోకి మారడం కనిపించవచ్చు.

5. యూరియా కలిపారో లేదో ఇలా తెలుసుకోండి

పాలలో కొవ్వు (Fat), ఘనపదార్థాల (SNF) శాతం ఎక్కువగా కనిపించేందుకు కొన్నిసార్లు యూరియా కలుపుతారు. ఇది ముఖ్యంగా మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

దీన్ని పరీక్షించేందుకు:

  • 5 మిల్లీలీటర్ల పాలను టెస్ట్ ట్యూబ్‌లో తీసుకుని లిట్మస్ పేపర్‌ను అందులో సగం వరకు ముంచాలి.
  • ఫలితం: లిట్మస్ పేపర్ నీలం రంగులోకి మారితే యూరియా కలిపినట్లు భావించవచ్చు. ఎలాంటి రంగు మార్పు లేకపోతే పాలు స్వచ్ఛమైనవిగా పరిగణించవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యం

పాలు మన రోజువారీ ఆహారంలో కీలక భాగం. కాబట్టి వాటి నాణ్యతపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఇంట్లోనే ఈ సులభ పరీక్షలు చేయడం ద్వారా కల్తీ పాలను ప్రాథమికంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే అనుమానం ఉన్న సందర్భాల్లో అధికారిక ప్రయోగశాలల్లో పరీక్ష చేయించడం లేదా సంబంధిత ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం.



Source link

Leave a Comment