చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ముడి చక్కెర దిగుమతిపై కొత్త నిబంధనలు..! | Sugar Price Rise Linked To El Nino And Red Rot Disease, Temporary Raw Sugar Imports Initiated


దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చక్కెర దిగుమతికి సంబంధించిన నిబంధనలను సవరించింది. టారిఫ్ రేట్ కోటా (TRQ) కింద దిగుమతి చేసుకునే ముడి చక్కెరను దేశీయ మార్కెట్లోకి తీసుకురావడంలో ఇకపై సరుకు రవాణా ఆధారంగా గడువును నిర్ణయించనుంది. తాజా నిబంధనల ప్రకారం దిగుమతిదారులు బిల్ ఆఫ్ ఎంట్రీ దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ముడి చక్కెరను శుద్ధి చేసి, తెల్ల చక్కెరగా దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర TRQ దిగుమతులకు ఒక నిర్దిష్ట తుది గడువు ఉండేది. అక్టోబర్ 31, 2026లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. తాజాగా ఆ విధానాన్ని మార్చి, ప్రతి సరుకుకు ప్రత్యేకంగా రెండు నెలల కాలపరిమితిని నిర్ణయించింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెర ఎక్కువకాలం నిల్వ ఉండకుండా, వేగంగా శుద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడమే ఈ మార్పు ఉద్దేశంగా కనిపిస్తోంది.

నెలలోనే 15.6 శాతం పెరిగిన ధర

చక్కెర ధరలు సామాన్యులపై అదనపు భారం మోపుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 20న కిలో చక్కెర సగటు చిల్లర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20 నాటికి అది రూ.55.70కి చేరింది. అంటే కేవలం నెల రోజుల్లోనే కిలోకు రూ.7.52 పెరిగింది. శాతాల పరంగా చూస్తే ఇది సుమారు 15.6 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది.

ఉత్పత్తి తగ్గడమే కారణమా?

చక్కెర ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. చెరకు, చక్కెర ఉత్పత్తిపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఎల్‌నినో పరిస్థితులు చెరకు పంటను ప్రభావితం చేశాయని, భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిన్నట్లు వివరించారు. దేశంలో ఏడాదికి సుమారు 28 మిలియన్ టన్నుల చక్కెర అవసరం ఉందని, ప్రస్తుతం దేశం వద్ద 20–25 లక్షల టన్నులకు పైగా అదనపు చక్కెర నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

దిగుమతి నిబంధనల్లో తాజా మార్పుతో ముడి చక్కెర వేగంగా శుద్ధి అయి మార్కెట్లోకి వస్తే.. సరఫరా పెరిగి ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా మారతాయన్నది దేశీయ ఉత్పత్తి, దిగుమతులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Comment