సచివాలయం వద్ద కలకలం.. హుస్సేన్ సాగర్‌లో దూకిన విదేశీయుడు.. సకాలంలో స్పందించిన పోలీసులు! | Saifabad police rescued foreigner jumping into Hussain Sagar lake in Hyderabad


హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఓ విదేశీయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సచివాలయం ఎదుట హుస్సేన్ సాగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సరస్సులోకి దూకిన విదేశీయుడిని అక్కడే విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచివాలయం ముందు హుస్సేన్ సాగర్ వద్ద ఓ వ్యక్తి నీళ్లలోకి దూకాడు. ఈ విషయం అక్కడ విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు తాడు సహాయంతో సరస్సులోకి దిగి అతడిని రక్షించారు. అనంతరం అతడిని ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాథమికంగా పరిస్థితిని పరిశీలించారు.

రక్షించిన వ్యక్తిని సూడాన్ దేశానికి చెందిన ఏడీ డ్రిల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అతడిని తదుపరి విచారణ నిమిత్తం లేక్ పోలీసులకు అప్పగించారు. అతడు హుస్సేన్ సాగర్‌లోకి ఎందుకు దూకాడు? ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేమిటి? అనే కోణాల్లో లేక్ పోలీసులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడ్డాడా, మరేదైనా కారణం ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

సకాలంలో స్పందించిన సైఫాబాద్ పోలీసులు తాడు సహాయంతో విదేశీయుడిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీసుల సమయస్పూర్తిని మెచ్చుకుంటూ.. పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Comment