Good Morning: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! | Are You Making These 5 Morning Mistakes? They Could Be Draining Your Energy and Health


Morning Habits: ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, రోజంతా మన శరీరం, మనసు కూడా దాదాపు అలాగే స్పందిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఉదయపు అలవాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయి. కాబట్టి రోజును ఉత్సాహంగా, చురుకుగా గడపాలంటే ఉదయం చేసే కొన్ని అలవాట్లను మార్చుకోవడం అవసరం.

ఒక్కసారిగా మంచం నుంచి లేచేయకండి

నిద్రలేచిన వెంటనే మంచం మీద నుంచి హఠాత్తుగా లేచిపోవడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. రాత్రంతా విశ్రాంతిలో ఉన్న శరీరాన్ని క్రమంగా మేల్కొలపడం మంచిది. లేవడానికి ముందు కాసేపు చేతులు, కాళ్లు కదపడం, పక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం వల్ల శరీరానికి సౌకర్యంగా ఉంటుంది. దీంతో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

ఉదయాన్ని పరుగుల జీవితంగా మార్చొద్దు

ఉదయం లేవగానే పనుల ఒత్తిడిలో పడిపోవడం చాలామందిలో కనిపించే సమస్య. ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ లేకపోతే చివరి నిమిషంలో హడావుడి మొదలవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అందుకే మరుసటి రోజు అవసరమైన వస్తువులు, దుస్తులు, ఇతర ఏర్పాట్లు ముందురోజే చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఉదయం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

అల్పాహారాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను వదిలేస్తుంటారు. కానీ ఉదయం ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీర్ఘకాలంలో ఈ అలవాటు మెటాబాలిజంపై ప్రభావం చూపి ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిల అసమతుల్యత వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడడం తగ్గించండి

చాలామంది కళ్లు తెరవగానే మొబైల్ ఫోన్ తీసుకుని సోషల్ మీడియా, మెసేజ్‌లు, వార్తలు చూస్తుంటారు. అయితే రోజును ఇలా ప్రారంభించడం మనసుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నెగెటివ్ వార్తలు లేదా ఒత్తిడిని కలిగించే సమాచారం కనిపిస్తే రోజంతా మూడ్ దెబ్బతినవచ్చు. అందుకే ఉదయం కొంతసేపు ఫోన్‌కు దూరంగా ఉండి పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా ప్రకృతిని ఆస్వాదించడం మంచిది.

శరీరానికి సమయం ఇవ్వండి

ఉదయం లేవగానే కఠినమైన వ్యాయామాలు లేదా భారీ బరువులు ఎత్తడం కంటే ముందుగా శరీరాన్ని సిద్ధం చేయడం అవసరం. రాత్రంతా విశ్రాంతిలో ఉన్న కండరాలు, కీళ్లు కొంత గట్టిపడే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా స్ట్రెచింగ్, వార్మప్, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించడం మంచిది. దీంతో గాయాల ప్రమాదం తగ్గడమే కాకుండా శరీరం వ్యాయామానికి సిద్ధమవుతుంది.

ఉదయపు ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటి?

  • నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం
  • కొద్దిసేపు స్ట్రెచింగ్ లేదా యోగా చేయడం
  • పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకోవడం
  • మొబైల్‌కు బదులుగా పుస్తకం లేదా ధ్యానానికి సమయం కేటాయించడం
  • రోజుకు అవసరమైన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం

చివరగా.. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఉదయం చేసే చిన్న చిన్న అలవాట్లను సరిచేసుకుంటే చాలు. ప్రశాంతంగా రోజును ప్రారంభించడం, సమయానికి అల్పాహారం తీసుకోవడం, శరీరాన్ని క్రమంగా చురుకుగా మార్చుకోవడం వంటి అలవాట్లు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజును సరైన విధంగా ప్రారంభిస్తే ఉత్సాహం, ఏకాగ్రత, పనితీరు అన్నీ మెరుగుపడతాయి.



Source link

Leave a Comment